తాజా ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే గత ఐదేళ్లుగా సభలో ప్రతిపక్షాన్ని నియంతృత్వ ధోరణిలో చూస్తూ సభను నడిపిన ప్రభుత్వానికి ఇప్పుడు సభ సంప్రదాయాల్ని గౌరవిస్తూ హుందాగా నడిపుతున్న ప్రభుత్వానికీ గల తేడాను ప్రజలంతా గమనిస్తున్నారు. విపక్ష సభ్యులపై విమర్శలను కూడా కళాత్మకంగా, చమత్కారంగా చేస్తూనే సభా మర్యాదను కాపాడుతున్నారు అధికారపార్టీ నేతలు. అయితే చంద్రబాబుకు మాత్రం అధికారం దూరమైందన్న బాధ ఓ వైపు, తాను చేసిన అక్రమాలు, తప్పులు ఎత్తి చూపుతున్నారన్న ఉక్రోశం మరోవైపు కనిపిస్తోంది. దారుణంగా ఓడిపోయి తనఉనికిని చాటుకోవడంకోసం నలభై ఏళ్ల అనుభవం, మూడుసార్లు అధికారం, మూడుసార్లు ప్రతిపక్షం అంటూ ఇంకా తన గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రతీ విషయాన్నీ రాద్ధాంతం చేస్తూ, సభలో చర్చను కొనసాగనివ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా, సభా నియమాలను కాదని తనకు నచ్చినట్టే జరగాలని విచిత్రంగా చంద్రబాబు పట్టు పడుతున్నారు. అలాగే మంత్రుల సమాధానాలకు అడ్డు తగులుతున్నారు. టీడీపీ హయాంలో అవినీతి గురించి మాట్లాడనీయకుండా సభలో అచ్చెం, నిమ్మలచేత అల్లరి చేయిస్తున్నారు. అలాగే శాశన మండలిలో నారాలోకేష్ తీరు కూడా ఇలాగే ఉంది. ముఖ్యమంత్రిపై అనుచిత వాఖ్యలు చేస్తూ అధికార పార్టీ సభ్యులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా లోకేష్ మాట్లాడుతున్నారు. తమ అవినీతి పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్నీ, రాష్ట్రానికి జరిగిన నష్టాన్నీ, ఖజానాకు పడిన భారాన్ని అధికారపార్టీ సభ్యులు ఎత్తిచూపుతున్నా ఇదంతా ప్రజలకు చేరకుండా ఉండాలంటే టీడీపీ నాయకులు ఎంచుకున్న మార్గం ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసి సభలో గందరగోళం సృష్టిస్తున్నారు.