తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు ఆసరా కల్పించి.. వితంతువులకు భరోసానిచ్చి..వికలాంగులకు చేయూతనందించి పేదల ఇంట్లో సీఎం కేసీఆర్ పెద్దకొడుకయ్యాడని రాష్ర్ట అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో పెంచిన పింఛన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్ల అమలును హర్షిస్తూ మంత్రి అల్లోల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు నేటి నుంచి అమలులోకి వచ్చిందన్నారు. పెరిగిన పింఛన్ ప్రకారం వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున, వికలాంగులకు రూ.3,016 చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,47, 400 మంది లబ్ధిదారులు ఉన్నారు.
గతంలో ఫించన్ల కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల 36 లక్షలు ఖర్చు చేస్తే ఇప్పుడు పెంచిన ఫించన్ల కోసం దాని కంటే రెట్టింపుగా రూ.31 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణలో దేశం గర్వించదగ్గ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఇతర పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కే. విజయలక్ష్మి, కలెక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 323