ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గాల వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం తిరస్కరించిందన్నారు. రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచబ్యాంకును అడిగింది చంద్రబాబేనని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని, అందువల్లే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకు నివేదికలు పంపారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ యాక్టును దుర్వినియోగం చేశారని, భూరికార్డులను తారుమారు చేస్తున్నారని రైతులు ప్రపంచబ్యాంకు దృష్టి తీసుకెళ్లారని తెలిపారు. కౌలు రైతులు, రైతులను టీడీపీ ఇబ్బందులకు గురిచేసిన కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని, తమ భూములు కాజేస్తున్నారని దళితులు ప్రపంచబ్యాంకుకు సమాచారమిచ్చారని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తేనే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడంలేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మీడియా వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ భూ అవకతవకలతోపాటు టీడీపీ హయాంలో చేసిన ప్రతీస్కాం బయటకు వస్తుందని సీఎం జగన్ తెలిపారు. 15రోజుల్లోనే టీడీపీ చేసిన స్కాములన్నీ బయటకు వస్తాయన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సీఎం మాట్లాడుతూ పోలవరాన్ని స్కామ్ లతో కూడిన ప్రాజెక్టుగా టీడీపీ చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై గతప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించిన తీరుపై తమ ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసిందన్నారు. స్కాములన్నీ ప్రజలముందు పెడతామన్నారు. చంద్రబాబు సభను స్వార్థం కోసం వాడుకుంటున్నారన్నారు జగన్. అయితే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అయితే బీజేపీలో చేరిపోదాం.. లేదా జగన్ ని తప్పు జరిగిపోయిందని వేడుకుందాం.. అంటూ టీడీపీ మాజీలు, ప్రస్తుత నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.