భారత క్రికెట్ లెజెండ్ సచిన్ కి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం లభించింది. సచిన్ తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అలన్ డోనాల్డ్, ఆసీస్ మాజీ మహిళా క్రికెటర్ క్యాథిరిన్ ఫిట్జ్‌పాట్రిక్‌లకు ఈ అవకాశం లభించింది. ఐసీసీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్‌లో నిర్వహించిన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమంలో సచిన్ పాల్గొని మాట్లాడారు. తనకు లభించిన ఈ గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అటు టెస్టులు, ఇటు వన్డేల్లో అత్యధిక పరుగులతోపాటు వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ అని ఐసీసీ కొనియాడింది. ‘లెజెండ్ అనే పదం సచిన్‌కి తక్కువే.. తాజాగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయనకి స్థానం కల్పించాం’ అని ఐసీసీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్దనే సచిన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. అందుకు సంబంధించిన వీడియో సైతం ఐసీసీ విడుదల చేసింది.
