పక్క రాష్ట్రాలతో తమ ప్రభుత్వం సన్నిహితంగా మెలుగుతోందనే బాధ టీడీపీ నేతల్లో స్పష్టంగా కనబడుతోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడిన దాంట్లో సబ్జక్ట్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అందరికీ తెలిసిన విషయాలనే అచ్చెన్నాయుడు పదేపదే ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి రాత్రికి రాత్రి హైదరాబాద్‌నుంచి పారిపోయి వచ్చారంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆ భవనాలు ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయని, ఆ భవనాలకు మూడేళ్లుగా కరెంట్ బిల్లులు కూడా కట్టలేదని తెలిపారు. వాటిని ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలనే తెలంగాణకు ఇచ్చామన్నారు.
