టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ… తెలుగు రాష్ట్రాల్లోనూ బలాన్ని పెంచుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అసంతృప్తి నేతలను, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాయపాటిని బీజేపీ నేత రాం మాధవ్ కలిశారు. రాయపాటి ఇంటికి వెళ్లి మరీ బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో రాయపాటి కుటుంబానికి బలం ఎక్కువే. ఆయన కనుక బీజేపీలో చేరితే… ఆయన మద్దతుదారులంతా బీజేపీలోకి వచ్చి చేరే అవకాశం ఉంది. దాంతో పార్టీని ప్రతిష్టం చేసుకోవచ్చని బీజేపీ యోచిస్తోంది. రాం మాధవ్ ఇచ్చిన ఆఫర్ పై రాయపాటి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఢిల్లీ వచ్చి పార్టీ పెద్దలను కలుస్తానని రాయపాటి చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే.. రాం మాధవ్ తో భేటీ తర్వాతి రోజే.. రాయపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకున్న ఇబ్బందులను చంద్రబాబుకి వివరించినట్లు సమాచారం. ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతోపాటు.. పలు సమస్యలను విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… రాయపాటి మాత్రం పార్టీ మారాలా లేదా.. టీడీపీలోనే కొనసాగాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.