సినీ నటుడు రాఘవ లారెన్స్ ను కలిసి వైద్యసాయం పొందడానికి వచ్చిన నిరుపేద కుటుంబం గత నాలుగు రోజులుగా స్థానిక ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు. రాజాపాళయంకి చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుకు గురుసూర్యకి గుండెకి సంబంధించిన వ్యాధి రావడంతో వారు సాయం కోసం లారెన్స్ ని కలవాలని అనుకున్నారు.దీంతో చెన్నైకి వచ్చిన వారికి లారెన్స్ అడ్రెస్ తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైల్వేస్టేషన్ లో భిక్షమెత్తుకొని బతికారు. ఈ విషయం మీడియాలో రావడంతో అది లారెన్స్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన లారెన్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నా.. మంగళవారం ఉదయాన్నే గృహలక్ష్మిని ఆమె కొడుకుని వెంట తీసుకురమ్మని అనుచరులను పంపారు.
ఎగ్మూర్ రైల్వే స్టేషన్ కి వెళ్లిన వారు లారెన్స్ పంపించారని చెప్పి అతడిని ఇంటికి తీసుకువెళ్లారు. ఆ తరువాత నటుడు లారెన్స్ వారిని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సహాయం కోసం తనను వెతుక్కుంటూ చెన్నై వచ్చారని తెలిసి బాధపడ్డానని చెప్పారు.ఆ పిల్లాడి సమస్య ఏంటనేది తెలుసుకొని వీలైనంత వరకూ తన ట్రస్ట్ ద్వారానే వైద్య సేవలు అందిస్తానని తెలిపారు.