‘ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు చేసుకోగలిగామని ప్రజలంతా సంతృప్తి చెందాలి.. రాష్ట్రంలో ఆ పరిస్థితి తీసుకురావడమే మన ముందున్న లక్ష్యం..’అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జూలై 1వతేదీ నుంచి 12 వరకు జిల్లాలవారీగా అందిన వినతిపత్రాలు, పరిష్కారాలపై సీఎం జగన్ మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. పాణ్యం అక్రమ పాఠశాల హాస్టల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి అక్కడున్న పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చిన వైనాన్నిజగన్ ప్రశంసించారు. కర్నూలు కలెక్టర్ ఆకస్మికతనిఖీ వీడియోను నేరుగా ఆయన చూశారు. మిగతా అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తే వ్యవస్థలు బాగుపడతాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
పాణ్యం గిరిజన గురుకుల పాఠశాలకు తాళాలు
మండల కేంద్రమైన పాణ్యంలోని గిరిజన సంక్షేమ గురుకుల (బాలుర)పాఠశాలను సోమవారం అర్ధరాత్రి కలెక్టర్ వీరపాండియన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కలెక్టర్ పాఠశాలకు వచ్చేసరికి ప్రధాన గేట్లు తాళం వేసి ఉన్నారు. ఎంత పిలిచినా సిబ్బంది ఎవరూ బయటకు రాలేదు. దీంతో అరగంట పైగానే కలెక్టర్ గేటు బయటే నిల్చున్నారు. చేసేదేమీ లేక కలెక్టర్ గన్‌మెన్, అటెండర్ గోడలు దూకి తాళాలను పగులగొట్టారు. రెండో ప్రధాన గేటు తాళాన్ని కూడా పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కలెక్టర్ లోపలికి వెళ్లగా కేవలం అందులో విద్యార్థులు మాత్రమే ఉండంతో వారిని నిద్రలేపారు. పాఠశాలలో పని చేస్తున్న వార్డెన్, వాచ్‌మెన్, అటెండర్, ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది ఎక్కడ ఉన్నారని ఆరా తీసి వారికి ఫోన్ చేశారు. హుటాహుటిన ప్రిన్సిపాల్ మేరిసలోమితోపాటు ఇతర సిబ్బంది కలెక్టర్ ముందుకు వచ్చారు. ఎందుకు తాళం తీయలేదని, పాఠశాలలో నైట్ వాచ్‌మెన్, ఇతర సిబ్బంది ఎక్కడున్నారని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో తక్షణమే వారిని విధులనుంచి తొలగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రిన్సిపాల్ సలోమిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.