ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న నరసింహాన్ ఇక నుంచి తెలంగాణకు మాత్రమే పరిమితం కానున్నారు. ఒడిశాకు చెందిన విశ్వభూషణ్ హరిచందన్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్ పార్టీల నుంచి మరో రెండు సార్లు గెలిచారు. భువనేశ్వర్ నుంచి మూడు సార్లు గెలిచిన ఆయన సిలికా నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు.
1971లో జనసంఘ్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1977లో బీజేపీలో చేరారు. న్యాయవాద విద్యను అభ్యసించిన విశ్వభూషణ్.. ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. పలు పుస్తకాలు రచించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుత వయసు 85 ఏళ్లు కాగా.. ఒడిశా బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఇక చత్తీస్‌గడ్ నూతన గవర్నర్‌గా అనసూయ ఊకీ నియమితులయ్యారు.