ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సినీ ప్రముఖులకు సైతం కొన్ని పదవులు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్న దానిపై ఆయన క్లారిటీకి వచ్చేసినట్లు అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇలీవలనే ప్రముఖ నటుడు పృథ్వీ రాజ్‌కు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్ పదవి కేటాయించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ . తాజాగా మరో నటుడి పేరు బయటికొచ్చింది. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వాళ్లలో ప్రముఖ కమెడియన్ అలీ ఒకరు. అటు జనసేనతోనూ.. ఇటు తెలుగుదేశంతోనూ టచ్‌లో ఉన్న ఆయన ఊహించని విధంగా ఫ్యాన్ కిందకు చేరిపోయారు. ఆ సమయంలో తనకు మంత్రి కావాలని ఉందని, ప్రస్తుతం అవకాశం లేని కారణంగా పోటీ చేయలేకపోతున్నాని చెప్పుకొచ్చారు. తాజాగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై వైసీపీ నుంచి ఓ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.