కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే ఆయన వారసుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కావాలన్నారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, తమ పార్టీలో చేరేందుకు చాలా మంది నాయకులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. విభజన అనంతరం ఏపీ అభివృద్ధికి పెద్ద ఎత్తున బీజేపీ సహాయం చేస్తే తమకు వ్యతిరేకంగా టీడీపీ అసత్య ప్రచారాలు చేసిందని మండిపడ్డారు. నాడు నేడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
