తెలంగాణలో ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించే క్రమంలో టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తోన్న దేశంలోనే గుర్తింపు పొందిన మంచినీటి పథకం మిషన్ భగీరథ .ఈ పథకానికి సంబంధించిన నాలెడ్జ్ సెంటర్‌ను గజ్వేల్ పరిధిలోని కోమటిబండ గుట్టపై ఏర్పాటుచేస్తున్నారు. మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఈ సెంటర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ గూగుల్ ద్వారా గుర్తించి గజ్వేల్‌తోపాటు సిద్దిపేట డివిజన్లోని పలు ప్రాంతాలకు కోమటిబండ నుంచి గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు డిజైన్ చేశారు. ఇది దేశంలోనే ఓ అద్భుత గ్రావిటీ నీటి సరఫరా కేంద్రంగా గుర్తింపు పొందింది. మిషన్ భగీరథ పథకం ఊహించిన దానికన్నా విజయవంతమై ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
దేశవిదేశాల నుంచి ఎందరో మిషన్ భగీరథ కోమటిబండ సంప్‌హౌస్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. పర్యాటక ప్రాంతంగా మారడం, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం గురించి వివిధ ప్రాంతాల
ఇంజినీర్లు, మేధావులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపడంతో కోమటిబండ గుట్టపై నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అందమైన హాలు నిర్మాణం పూర్తయ్యింది. అయితే ఈ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు.
