అప్పటి ఉమ్మడి ఏపీలో పోలవరం ప్రాజెక్టు గురించి 2004 వరకు తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాల పెంపుదలపై వచ్చిన ప్రశ్నకు ఆయన సమాదానం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి చొరవ వల్లే కాల్వలు తవ్వారని, అవి కనుక సిద్దం కాకుండా ఉండి ఉంటే, ఇప్పుడు భూమి సేకరణ కు ఎంత వ్యయం అయి ఉండేదో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. పోలవరం హెడ్ వర్క్స్ వ్యయ అంచనాలు ఇష్టం వచ్చినట్లు పెంచారని ఆయన అన్నారు. పునరావాస కార్యక్రమాల కింద మూడువందల కుటుంబాలకైనా పరిహారం పూర్తిగా ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు.
రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడానికి తమ ముఖ్యమంత్రి జగన్ సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు.టిడిపి ఎమ్మెల్యేలు మట్లాడుతూ గతంలో పోలవరం అంచనాల పెంపులో అవినీతి జరిగిందని వైసిపి నేతలు చెప్పారని, అంచనాలను తగ్గించడానికి కేంద్రానికి లేఖలు రాస్తున్నారా అని అడిగారు. అసలు కేంద్రం పూర్తిగా చేపట్టవలసిన ప్రాజెక్టును రాష్ట్రం ఎందుకు తీసుకుందని ఆయన ప్రశ్నించారు.
స్పిల్ వే నిర్మాణం 75శాతం అయిందని, చెప్పి వంద కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని తరలించి భజన చేసుకున్నారని, అందులో ఇరవై కోట్లు తినేశారని ఆయన అన్నారు.ఎడమ కాల్వ నిర్మాణంలో 39 కోట్ల పనులు పెండింగులో ఉంటే మాజీ ఆర్దిక మంత్రి వియ్యంకుడుకి 189 కోట్ల రూపాయలు, ఇలా ఆయన పనులలో 500 కోట్ల రూపాయలు తినేశారని ఆయన ఆరోపించారు.పోలవరం ప్రాజెక్టులో ఎనిమిది శంకుస్థాపనలు చేసి కోట్ల వ్యయం చేశారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.