కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది. ట్విటర్ వేదికగా ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటూ విమర్శలతో రోడ్డున పడ్డారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. కేశినేని నాని ఆదివారం ఉదయం బుద్దా వెంకన్నను ఉద్దేశించి కేశినేని ట్వీట్ చేశారు.
దీనిపై కొద్దిసేపటికే బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘సంక్షోభం సమయంలో పార్టీ కోసం…నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు..చనిపోయేవరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ ట్వీట్ చేశారు. అంతకు ముందు కేశినేని నాని… నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడని కేశినేని నాని ట్వీట్ చేశారు. అంతేకాదు నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు… ఇది మన దౌర్భాగ్యం అంటూ ట్వీట్‌లో విమర్శించారు.