ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు కు మైండ్ బ్లాక్ అయ్యిందని పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. నవరత్నాలను 80 శాతం ప్రజలకు చేర్చేలా బడ్జెట్ ఉంటే.. యనమల ఎన్నికల హామీలను నెరవేర్చలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యనమల కళ్లు పోయాయా అని ప్రశ్నించారు. జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే.. చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించాడని ఆయన విమర్శించారు. రైతు భరోసా ద్వారా రైతులకు రూ. 8750 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. పంటల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3 వేల కోట్లు కేటాయించామన్నారు. నామినేటెడ్ పోస్టులో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు.
