Home / SLIDER / కాళేశ్వరంలో జలకళ

కాళేశ్వరంలో జలకళ

దిగువనుంచి వస్తున్న జలాలతో గోదారి ఎదురెక్కుతున్నది. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లతోపాటు.. మానేరులోనూ పెద్దఎత్తున నీరు పోగుపడుతుండటంతో క్రమేణా విస్తరిస్తున్నది. ప్రాణహితనుంచి వస్తున్న వరదనీటిని సాగునీటిశాఖ ఇంజినీర్లు మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లలో నిల్వచేస్తున్నారు. మేడిగడ్డలో మొత్తం అన్ని గేట్లను మూసివేయడంతో శుక్రవారానికి సుమారు 4.50 టీఎంసీల నీరు చేరింది. ఫలితంగా ఇక్కడ గోదావరిలో బ్యాక్‌వాటర్ 20 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అటు అన్నారం బరాజ్‌లో నీటినిల్వ 2.50 టీఎంసీలు దాటింది. దీంతో ఇక్కడ బ్యాక్‌వాటర్ 22 కిలోమీటర్లవరకు నిలిచింది.
 
అన్నారం బరాజ్ నిండుతుండటంతో మానేరులోనూ 3.8 కిలోమీటర్ల వరకు బ్యాక్‌వాటర్ వచ్చింది. మొత్తంగా మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ల బ్యాక్‌వాటర్‌తో దాదాపు 42 కిలోమీటర్ల పొడవున గోదావరి నిండుకుండను తలపిస్తున్నది. కన్నెపల్లి వద్ద 12వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతున్న నేపథ్యంలో పంపుహౌస్‌లోని 1, 3, 4, 6 నంబర్ల మోటర్లతో 9600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో గ్రావిటీకాల్వద్వారా జలాలు అన్నారం బరాజ్‌కు చేరుకుంటున్నాయి. ప్రాణహిత నదినుంచి వస్తున్న నీరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలిసిన తర్వాత ఇక్కడ శుక్రవారం 11,500 క్యూసెక్కుల నీటిప్రవాహం నమోదైంది. ఈ నీటిలో కొంత కన్నెపల్లి పంపుహౌస్‌కు, మరికొంత మేడిగడ్డ బరాజ్‌కు చేరుతున్నాయి. మేడిగడ్డలోని మొత్తం 85 గేట్లను మూసివేటంతో ప్రాణహిత ద్వారా వచ్చే నీరు మొత్తం బరాజ్‌లోనే నిలిచిపోనున్నది.
మేడిగడ్డలో 4.50 టీఎంసీలు
మేడిగడ్డ బరాజ్‌లో శుక్రవారానికి నీటినిల్వ 95వ మీటర్ దాటిందని ప్రాజెక్టు ఈఈ వెంకటరమణారెడ్డి నమస్తే తెలంగాణకు చెప్పారు. మరోవైపు కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్లు నిరంతరం పనిచేస్తుండటంతో అన్నారం బరాజ్‌లో గంటకు రెండు అంగుళాల లెక్కన నీటిమట్టం పెరుగుతున్నట్టు బరాజ్ ఈఈ యాదగిరి వెల్లడించారు. అన్నారం బరాజ్ నుంచి నీటిని ఎత్తిపోసే పంపుహౌస్ పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగువద్ద ఉన్నది. అన్నారం బరాజ్ నుంచి ఎగువన 29 కిలోమీటర్ల దూరంలోని ఈ పంప్‌హౌస్‌కు బ్యాక్‌వాటర్ ఆదివారం చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుందిల్ల బరాజ్ నుంచి నీటిని దిగువన అన్నారం పంపుహౌస్‌కు విడుదలచేశారు.
 
ఇది నేరుగా అప్రోచ్ కెనాల్ నుంచి హెడ్ రెగ్యులేటర్ ద్వారా అన్నారం పంపుహౌస్ ఫోర్‌బేలోకి చేరింది. దీంతో అన్నారం పంపుహౌస్‌లోని మోటర్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్నారం బరాజ్‌లో పెరిగే నీటి నిల్వతో గోదావరిలో నిలిచే బ్యాక్‌వాటర్ రాగానే ఇక్కడ ఎత్తిపోత ప్రారంభించేందుకు ఇంజినీర్లు మోటర్లను సిద్ధం చేస్తున్నారు. అన్నారం పంపుహౌస్ నుంచి నాలుగైదు రోజుల్లో గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభం కావచ్చని ఈఈ యాదగిరి చెప్పారు. సుందిల్ల బరాజ్‌కు కూడా జలాల తరలింపు మొదలైతే.. మరికొన్ని రోజుల్లో అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోత మొదలుకానుంది. దానితర్వాత ఎల్లంపల్లి జలాశయంలో నీటిమట్టం ఆధారంగా నందిమేడారం పంపుహౌస్ మోటర్లు ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి ప్యాకేజీ-7 ద్వారా జలాలను తరలించి రామడుగు పంపుహౌస్‌లోని బాహుబలి మోటర్లను నడిపే అవకాశాలపై అధికారులు దృష్టిసారించనున్నారు.
నాలుగు మోటర్లతో పంపింగ్
కన్నెపల్లి వద్ద నాలుగు మోటర్లతో గోదావరి జలాల ఎత్తిపోత కొనసాగుతున్నది. గురువారం విరామం ఇచ్చిన ఒకటో నంబర్ మోటర్‌ను ఇంజినీర్లు తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభించారు.ప్రతిరోజు కన్నెపల్లి-అన్నారం గ్రావిటీ కెనాల్‌ద్వారా 8,400 క్యూసెక్కుల నీరు అన్నారం బరాజ్‌కు చేరుకుంటున్నదని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో 1, 3, 4, 6వ నంబర్ మోటర్లు నిర్విరామంగా నడుస్తుండగా.. ఐదో మోటర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
సముద్రంలోకి లక్ష క్యూసెక్కులు
ఇంద్రావతి కలిసిన తర్వాత పేరూరు వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం పేరూరు వద్ద సుమారు 69వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. దిగువన ధవళేశ్వరం బరాజ్‌కు 95వేల క్యూసెక్కులవరకు ఇన్‌ఫ్లో వస్తుండగా.. సముద్రంలోకి 1.09 లక్షల క్యూసెక్కుల గోదావరిజలాల్ని వదులుతున్నారు. గత నెల ఒకటోతేదీనుంచి శుక్రవారం ఉదయంవరకు 31.046 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి.
 
విలోచవరం చేరిన గోదారమ్మ
అన్నారం బరాజ్ రోజురోజుకు నిండుతుండటంతో గోదావరి జలాలు శుక్రవారం మంథని మండలం విలోచవరందాకా చేరా యి. మరో నాలుగు కిలోమీటర్లు ప్రవహిస్తే అన్నారం పంపుహౌస్‌లోకి చేరే అవకాశం ఉన్నది. పంపుహౌస్ అప్రోచ్ చానల్‌లోకి నీరు చేరగానే గేట్లు మూసి సుందిల్ల బరాజ్‌ను నింపడమే తరువాయి. ఇందుకు సంబంధించిన అన్నిఏర్పాట్లను కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఈ క్రమంలో గోదావరి ఎండే సమయంలో ఎక్కడెక్కడ చివరగా నీరు కనిపించిందో అక్కడక్కడి నుంచి నీరు పైకి ఎక్కుతున్న అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అన్నారం బరాజ్ ద్వారా వెనక్కివస్తున్న నీళ్లు అన్నారం పంపుహౌస్‌కు చేరుకునేలోగానే మోటర్లను వెట్న్‌క్రు సిద్ధంచేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పంప్‌హౌస్‌కు ఎగువన ఉన్న సుందిల్ల బరాజ్‌లో నిల్వ ఉన్న 0.06 టీఎంసీల నీటిని 3వ గేటు ఎత్తివేసి మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ నీరు అన్నారం పంపుహౌస్ డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్ల వద్దకు చేరుకున్నది. శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి ఆదేశాల మేరకు అన్నారం పంపుహౌస్ ఈఈ ఎలకొండ యాదగిరి, డీఈలు వొల్లాల వెంకటేశ్వర్లు, బిట్ల మధుసూదన్ ప్రత్యేకపూజలుచేసి హెడ్ రెగ్యులేటరీ గేట్ల ను తెరిచారు. ఆ నీరు పంప్‌హౌస్ ఫోర్‌బేలోకి చేరింది. పంప్‌హౌస్‌లో నీటి మట్టం ఐదు మీటర్లు పెరుగగా 16 మీటర్ల వాటర్‌హెడ్‌కు చేరుకోగానే మరిన్ని పరీక్షలు చేసి మోటర్లను పనిచేయించనున్నారు. From NT

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat