బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. తమ హైమాండ్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని… ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందని చెప్పారు. టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంపై మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని… కంటితుడుపు బడ్జెట్ గా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, దానికి కారణమైన ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
