సున్న వడ్డీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేశామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సున్నావడ్డీ పథకం పూర్తిగా సున్నా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఈ పథకంపై చర్చ సందర్భంగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గత టీడీపీ ప్రభుత్వ తీరునుఎండగట్టారు. ఓ దశలో ముఖ్యమంత్రి ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడ్డుకున్నారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, టీడీపీ తరఫున సభకు వచ్చినవారంతా అలాగే ప్రవర్తిస్తున్నారన్నారు. రౌడీలు, గుండాల్లా సభలో వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు.
వ్యవసాయ రుణాల్లో సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వకపోయినా ఇచ్చామని చెప్పుకుంటున్నారని, అందుకే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ సభలో వారి నాయకుడు ఎలా ఉంటారో, వారి సభ్యులు కూడా అలాగే ఉంటారు. సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వకపోయినా ఇచ్చామన‍్నారు. అందుకే ప్రజలు టీడీపీ ప్రభుత‍్వానికి బుద్ధి చెప్పారు. చంద్రబాబు ఎలా ఉంటారో.. వారి సభ్యులు కూడా అలానే ఉంటారు. ఆహో ఓహో అన్నట్లుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. సున్నా వడ్డీ పథకం గొప్పగా అమలు చేసినట్టు బాబు చెబుతున్నారు. అంతేకాదు రైతుల రుణాలన్నీ చెల్లించామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. ప్రజలు మీకు ఏ స్థాయిలో బుద్ధి చెప్పారో ఓ సారి ఆలోచించుకోవాలి” అని వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.