ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారుతండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి కృషి చేస్తున్న జగన్.. దివంగత సీఎం వైఎస్ పేరును ప్రధాన పథకాలకు పెట్టారు. బడ్జెట్లో రెండు పథకాలకు జగన్ పేరు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న సంక్రాతి కానుక, చంద్రన్న బీమా, చంద్రన్న చేయూత తదితర పథకాలకు నాటి సీఎం పేరు పెట్టినట్టుగానే.. జగన్ సర్కారు రెండు పథకాలకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెనగా నామకరణం చేసింది.
అమ్మఒడి పథకం జగన్ బ్రెయిన్ చైల్డ్. ఈ పథకాన్ని రూపకల్పన చేసింది ఆయనే కాబట్టి.. సీఎం పేరిట ఈ పథకాన్ని తీసుకొచ్చామని.. ఆయన్ను ఒప్పించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. ఈ పథకం కింద చదువుకునే విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు జమ చేయనున్నారు. తొలుత ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు మాత్రమే పరిమితం చేస్తారని వార్తలొచ్చాయి. కానీ ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా దీన్ని వర్తింపజేశారు. అంతేకాకుండా.. ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకానికి రూ.6455 కోట్లు ప్రకటించారు. వైఎస్ హయాంలో రూపుదిద్దుకున్న ఫీజు రియింబర్స్‌మెంట్ పథకానికి కూడా జగన్ పేరు ‘జగన్ అన్న విద్యా దీవెన’ పెట్టడం విశేషం. దీనికి రూ.4962 కోట్లు ప్రకటించారు.