ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని రాష్ట్రాన్ని విభజించారని ఆయన గుర్తు చేశారు. రాజధాని లేకుండా విభజనకు గురైన రాష్ట్రం ఏపీ రాష్ట్రమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు పార్లమెంట్‌లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రత్యేక హోదా హామీతో ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందిందన్నారు.
రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణకు తలసరి ఆదాయం ఒక్క రూపాయికి చేరితే… ఏపీ తలసరి ఆదాయం 60 పైసలకు పడిపోయిందన్నారు. ఆ తర్వాత కొంత పుంజుకొందన్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర కేబినెట్ కూడ ఆమోదం తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్రధానమంత్రి మోడీని కలిసిన సమయంలో సీఎం జగన్ కోరారని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.