కర్నూలు జిల్లాలో రాజకీయాలను శాసించిన నేతలు భూమా నాగిరెడ్డి – శోభా నాగిరెడ్డి. వీరిద్దరూ ఇపుడు లేరు. దీంతో వీరి వారసులుగా భూమా అఖిల ప్రియా రెడ్డి, భూమా బ్రహ్మానంద రెడ్డిలు రాజకీయాల్లో ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియ… తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ వచ్చిన అఖిలప్రియ… 2019లో జరిగిన ఎన్నికల్లో అటు ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన అఖిలప్రియ, ఇటు నంద్యాల నుంచి పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ ఓటమి చెందారు. దీంతో భూమా అఖిలప్రియ మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జిల్లా రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇందుకోసం సీఎం జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను సంప్రదించేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో ఆమె ఓడిపోగా, టీడీపీ అధికారానికి దూరమైంది. గతంలో తాను దూషించిన నేతలంతా ఇపుడు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ఆమె చూపు వైసీపీపై పడింది. రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఆమె జగన్ చెంతకు చేరాలని భావిస్తున్నారు. ఇందుకోసం జగన్ తల్లి వైఎస్. విజయమ్మకు దగ్గరయ్యారు. ఆమె ద్వారా పార్టీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నది. అంతేకాదు జగన్ అన్నకు క్షమాపణలు చెప్తాం.. తమను పార్టీలో చేర్చుకునేలా ఒప్పించు అమ్మా అంటూ ప్రాధేయపడినట్లు, తమను జగన్ చెంతకు తీసుకెళ్లగలిగే నేత కోసం ఆమె ఆరా తీస్తున్నారని సమాచారం.
