ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ…‘ మహాత్ముని లక్ష్యాన్ని సాధించే దిశగా మా బడ్జెట్ ఉంది. పేదల కన్నీళ్లు తుడిచే దిశగా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. ధృడమైన మార్పు రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. న్యాయపరమైన నియమాలకు లోబడే రాజకీయాలు చేస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాలు, అందరు ప్రజలకు మేలు చేసే దిశగా చర్యలు చేపట్టాం. కృష్ణ ఆయుకట్టు స్థిరీకరణ చేస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం. మ‍్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తాం. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెరదించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్‌ఆర్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు.’ అని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను ఏకో ఫ్రెండ్లీగా మారుస్తాం. ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తాం. అన్ని రంగాల సమగ్ర అభివృద్థే మా లక్ష్యం’ అని అన్నారు.
