తొలి ఏకాదశి హిందువులు చేసుకునే మొదటి పండుగ. ఈ పండుగతోనే హిందువులకు పండుగ రోజులు మొదలవుతాయి. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాకుండా దీన్ని హరి వాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు.ఈ పండుగ తరువాతనే వరుసగా వినాయక చవితి,దశమి,దీపావళి మొదలగు పండుగలు వస్తాయి. మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశుల్లో వస్తాయి. అయితే ఇందులో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు.ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీకగా చెబుతారు. యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయనిసూచిస్తారు. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయని అర్ధం.వర్షాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని చెబుతారు.