సింగరేణికి చెందిన భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న కార్మికులు, కార్మికేతరులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు అనుమతిచ్చింది. వంద గజాలలోపు స్థలాలను ఉచితంగా అందించనుంది. వెయ్యి గజాల వరకూ మాత్రం నామమాత్రపు ధర చెల్లించాల్సి ఉంటుంది. జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్) విస్తరించి ఉంది. ఆయా జిల్లాల్లో కంపెనీకి వేలాది ఎకరాల భూములున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం కోల్బెల్ట్లోని వివిధ పట్టణాలకు వలస వచ్చిన కార్మికులు, కార్మికేతరులు దశాబ్దాల క్రితం నుంచే సింగరేణి భూముల్లో అనధికారికంగా ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారు. కానీ ఆయా ఇంటి స్థలాలకు పట్టాలు లేక వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే సింగరేణి వ్యాప్తంగా ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలని కొన్నాళ్లుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయమై హామీ ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సింగరేణి అధికారులు ఆయా భూములను రెవెన్యూ అధికారులకు దఫదఫాలుగా బదలాయింపు చేశారు. తాజాగా రెగ్యులరైజేషన్కు అనుమతిస్తూ జీవో నంబర్76ను విడుదల చేశారు. ఇందుకోసం ఆయా స్థలాల్లో నివాసమున్నవారు చెల్లించాల్సిన రేట్లను పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆరు నెలల గడువు విధించారు.