చిత్రం: దొరసాని
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, కన్నడ కిశోర్, వినయ్ వర్మ, `ఫిదా` శరణ్య తదితరులు
బ్యానర్: మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్
సమర్పణ: డి.సురేష్‌బాబు
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి
కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర
అతడి పేరు ఆనంద్ దేవరకొండ… విజయ్ దేవరకొండకు తమ్ముడు. మంచి చదువులు చదువుకుని యు.ఎస్.లో ఉద్యోగం వదిలేసి సినిమాల్లో నటించాలని ఇండియా వచ్చాడు. ఆమె శివాత్మిక రాజశేఖర్. జీవిత-రాజశేఖర్ రెండో కుమార్తె. చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే పుట్టిపెరిగినమ్మాయి. ఇంటర్ పూర్తి చేసుకుని తొలి ప్రయత్నంగా సినిమాలో నటించింది. వీరిద్దరినీ పరిచయం చేస్తూ `దొరసాని` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర. వెండితెర మీద అతనికి తొలి చిత్రమిది. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా తెలంగాణ గడీలను, దొరతనాన్ని, 80ల కాలంలో ఉన్న తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని టీమ్ ఇంతకు ముందే చెప్పింది. ఇంతకీ సినిమా ఎలా వచ్చింది? వాళ్లు చెప్పినవన్నీ ఇందులో కనిపించాయా?… చదివేయండి…
కథ
రాజు (ఆనంద్ దేవరకొండ) తెలంగాణలోని ఓ పల్లెటూరికి చెందిన కుర్రాడు. సొంత ఊరు వదిలి పట్టణంలో అమ్మమ్మ వారి ఊళ్లో చదువుకుంటూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు సున్నం వేసుకునే పని చేసుకుంటూ ఉంటారు. ఆ ఊరి పెద్ద దొర. అతనికి ఓ కుమార్తె ఉంటుంది. ఆ గడీ దొరసాని కన్నుమూయడంతో, చిన్న దొరసాని అల్లారుముద్దుగా పెరుగుతుంది. ఆమెకు తండ్రి అంటే భయం. ఆమె పేరు దేవకి (శివాత్మిక). బతుకమ్మ పండగ సమయంలో దొరసానిని తొలి సారి చూస్తాడు రాజు. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడతాడు. అతను తనను ప్రేమిస్తున్నాడని తెలుసుకుని మురిసిపోతుంది దొరసాని. మెల్లిగా ఆమెకూడా అతని పట్ల ఆకర్షితురాలవుతుంది. నిదానంగా గడి నుంచి అడుగుబయటపెట్టి అతన్ని కలుసుకుంటుంది. తమ మధ్య ఉన్న ఆకర్షణ మాత్రమే కాదనీ, ప్రేమ అనీ వారిద్దరికీ తెలుస్తుంది. ఓ సందర్భంలో అధరచుంబనం వరకు వెళ్తారు. ఆ దృశ్యం దొర కంట్లో పడుతుంది. దొరసానిని అమెరికా పంపే ప్రయత్నం చేస్తారు. సమసమాజం కోసం పాటుపడి, దొరకు ఎదురు తిరిగే అన్నలకు పెద్ద శంకరన్న (కిశోర్)కు రాజు – దొరసాని మధ్య జరిగే ప్రేమ గురించి తెలుస్తుంది. వెంటనే అతను పోలీసుల చేతిలో రాజు చావకుండా కాపాడుతాడు. పోలీసుల నుంచి బయటపడతాడు రాజు. అప్పటికే అతని కోసం వెతుక్కుంటూ వస్తుంది దొరసాని. ఆమెతో కలిసి ఆమె తోడబుట్టిన అన్న దగ్గరకు హైదరాబాద్‌కు పోతారు. ఆమె సోదరుడు వారికి ఆశ్రయం ఇస్తాడా? అసలు అక్కడేమైంది? దొర కొడుకు వారి ప్రేమకు పచ్చజండా ఊపుతాడా? వారిద్దరికీ ప్రేమ వివాహాన్ని జరిపిస్తాడా? కార్చిర్చు రేపుతాడా? అనేది ఆసక్తికరం.
ప్లస్ పాయింట్లు
– నటీనటుల నటన
– ఫ్రెష్ లొకేషన్లు
– కెమెరా పనితనం
– సంగీతం
మైనస్ పాయింట్లు
– ముందే తెలిసిపోయే కథ
– నెమ్మదిగా సాగే కథనం
విశ్లేషణ
విడుదలకు ముందే మంచి క్రేజ్ తెచ్చుకున్న చిత్రం `దొరసాని`. తెలంగాణ నేపథ్యంలో గడీ వ్యవస్థలో దొరబిడ్డకు, కూలోని కొడుకుకు మధ్య జరిగే ప్రేమకథగా పబ్లిసిటీ జరిగింది. నిజాయతీగా ప్రయత్నం చేసినట్టు దర్శకుడు చెప్పారు. సినిమా చూసినప్పుడు కూడా అదే అనిపిస్తుంది. `దొరసాని`లో అతి కొద్ది పాత్రల్లోనే తెలిసిన నటీనటులు కనిపిస్తారు. తెరమీద మొత్తం కొత్తవారిదే హవా. ఎక్కడా, ఏ సన్నివేశమూ కృత్రిమంగా అనిపించదు. సినిమా మొదలైన కాసేపటికే 80ల నేపథ్యంలోకి వెళ్లిపోతాడు ప్రేక్షకుడు. రాజు, అతని ఫ్రెండ్స్ తో కలిసి ఆ గడీలన్నిటినీ ఎక్కి దిగి పక్కనుండి చూస్తున్నట్టు అనిపిస్తుంది. కెమెరా పనితనం బావుంది. అలాగే సన్నివేశాలను ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. పాటలు బావున్నాయి. ఆర్ట్ వర్క్ కూడా కచ్చితంగా మెప్పు పొందుతుంది. కూలోడి కుమారుడిగా, తనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికీ పంచే చదువుతున్న కుర్రాడిగా, స్వచ్ఛమైన ప్రేమను పంచే వ్యక్తిగా ఆనంద్ దేవరకొండ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. దొర బిడ్డగా, అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న యువతిగా, తొలి ప్రేమను మనసారా ఆస్వాదించిన అమ్మాయిగా శివాత్మిక ఆ పాత్రలో ఒదిగిపోయింది. దొర పాత్ర, అతని దగ్గర దాసీగా ఉండే శరణ్య పాత్ర కూడా బావున్నాయి. దొరసానిని రాజు పెళ్లాడితే తాము కోరే సమసమాజం వస్తుందని ఆశించే ఉద్యమ నాయకుడిగా కిశోర్ తన పాత్రలో ఒదిగిపోయారు. పోలీస్ స్టేష్‌లో రాజును బట్టలు విప్పి కొట్టడం… ఆడియన్స్ కి సర్‌ప్రైజ్ షాట్స్. రాజు కోసం హైదరాబాద్ నుంచి పోలీస్ స్టేషన్‌కి వచ్చినప్పుడు శివాత్మిక నటన ప్రశంసలు పొందుతుంది. ఊహించదగ్గ క్లైమాక్స్ అయినప్పటికీ, చనిపోయిన తర్వాత కూడా తన చెల్లెలి దేహం రాజుకు తగలకుండా చూసుకునే దొర వారసుడి కర్కశత్వాన్ని చూపించడం బావుంది. తొలి సినిమా దర్శకుడైనా మహేంద్ర ఎక్కడ తడబడకుండా చెప్పాలనుకున్నదాన్ని స్పష్టంగా చెప్పారు. రాజు స్నేహితులుగా నటించిన వారు సహజంగా కనిపించారు. డైలాగులు కూడా అప్పటి సమాజాన్ని ప్రతిబింబించేలా బావున్నాయి.
బాటమ్ లైన్: పరువు హత్య నేపథ్యంలో… ‘దొరసాని’
రేటింగ్: 3.75/5
Tags 12 July 2019 (USA) Director Dorasani film nagar hyderabad Initial release K.V.R. Mahendra Producer movies slider tollywood Yash Rangineni