ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిననాటినుంచి ఇప్పటిదాకా కేంద్రం మీద పల్లెత్తు మాట కూడా అనలేదు.. తాజాగా బడ్జెట్ విషయంలో కేంద్రాన్ని నిందించే అవకాశం వచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన తెలుగు రాష్ట్రాలకి అసలేమీ ఒరిగే అవకాశం ఏమాత్రం లేదు. దీంతో ఇప్పటిదాకా వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తూ వచ్చిన వైసీపీ మోడీని కాకుండా కేంద్రాన్ని తిడుతున్నారు. అలాగే బడ్జెట్ పెట్టినరోజే ఆపార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బడ్జెట్ మీద పార్లమెంట్ ఆవరణలోనే మండిపడ్డారు. పార్టీ నేత సీ రామచంద్రయ్య కూడా మండిపడ్డారు. కేంద్రం ఎడాపెడా పన్నులు పెంచిందని, కేంద్రం ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఈబడ్జెట్ పనికొస్తుందని, రాష్ట్రాల ప్రయోజనాలపై కేంద్రం అసలే దృష్టి పెట్టకుండ బడ్జెట్ ప్రవేశ పెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పెట్రోల్ ధరలు పెంచితే ఆ ప్రభావం వివిధరంగాలపై పడుతుందని, పూర్తి మెజారిటీ వచ్చిందనే రాష్ట్రాలతో పనిలేదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ బడ్జెట్ కార్పొరేట్ ఆదాయం పెంచేలా ఉంది తప్ప సామాన్యులకి కాదని పన్నుల విధింపులలో పారదర్శకత లేదని వైసీపీ చెప్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. అయితే పార్లమెంట్ ఆవరణలో విజయసాయి రెడ్డి కనీసం సీఎంకు చెప్పకుండానే విమర్శలు గుప్పించారట.. అయితే ఈ విషయం జగన్ కు తెలిస్తే ఏమంటారో అనుకున్నారట.. తర్వాత జగన్ కు తెలిసాక ఆయన అన్నా మంచిపనే చేసారు అన్నారట.. ఇదే విషయంపై మాట్లాడుతూ మనం క్రమంగా కేంద్రంపై స్వరం పెంచుదాం.. మనం ఆశించిన స్థాయిలో న్యాయం జరగకపోతే ధిక్కార స్వరం వినిపిద్దాం అన్నారట. మంచే జరగాలని ఆశిద్దాం.. లేని పక్షంలో కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమవుదాం అని జగన్ పేర్కొన్నారట.. ఈమేరకు వైసీపీ ఎంపీలు కసరత్తు ప్రారంభించారు.