తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతాయనీ, అదే విధంగా జిల్లాలో కూడా సాగుతాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెరాస పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం మండల పరిధిలో నాయుడుపేటలోని రాంలీల ఫంక్షన్‌హాల్లోలో బుధవారం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జిల్లా నాయకురాలు స్వర్ణకుమారి వేదికపై కూర్చున్నారు. ఆ తరువాత కొంత సమయానికి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ఇన్‌ఛార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వేదికపైకి వచ్చారు.
తరువాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం మందిరంలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా తెరాస కార్యకర్తలు పెద్దఎత్తున తుమ్మల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సభా ప్రాంగణం మొత్తం మార్మోగింది. తుమ్మల నాగేశ్వరరావు వేదిక మీదకు రాగానే నాయకులంతా లేచి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తుమ్మలను ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తనకు పదవులు, అధికారం లేకపోయిన సీఎం కేసీఆర్‌తో ఉన్న సంబంధాలతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రహదారులు, ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ మొదటి ఐదేళ్లపాటు పార్టీ కంటే ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెట్టారని వివరించారు. ప్రస్తుతం పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వాల నమోదు పూర్తయిన తరువాత ప్రతి గ్రామానికి వస్తాననీ, అక్కడ స్థానిక ప్రజలు, కార్యకర్తల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాల నమోదు విధి విధానాల గురించి వివరించారు. కమిటీల ఏర్పాటు ప్రక్రియ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు ధరావత్ భారతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.