ఏపీలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లను తగ్గించేందుకు వైసీపీ కన్నేసింది. అది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నట్టు వ్యవహరించినట్టు కాదు.. వేరే విధంగా.. టీడీపీ గెలుచుకున్న 23సీట్లలో ఎమ్మెల్యేలపై ఏమేం లీగల్ లొసుగులు ఉన్నాయో అవన్నీ బయటపెడుతున్నారు వైసీపీ అభ్యర్ధులు. ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ వారి మీద వైసీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినచోట్ల వైసీపీ అభ్యర్థులు వారి ఎన్నిక చెల్లదంటూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కొందరు కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కేసుల గురించి అఫిడవిట్‌లో ప్రస్తావించని నేపధ్యంలో అలాగే మరికొందరు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన కింజరపు అచ్చెన్నాయుడు గెలిచారు. తన నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడ్‌విట్ లో తనపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను వెల్లడించలేదంటూ అక్కడి వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
2017లో అచ్చెన్నాయుడిపై అనంతపురం జిల్లా హీరేహళ్ లో కేసు నమోదయ్యిందని, అందులో ఆయన నిందితుడిగా ఉన్నారని తిలక్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు వివరాల్ని ఎన్నికల నామినేషన్ ప్రమాణ పత్రంలో వెల్లడించకుండా అచ్చెన్నాయుడు దాచిపెట్టారని అయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని అచ్చెన్నాయుడు ఎన్నికను రద్దు చేసి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని తిలక్ తన పిటిషన్లో కోరారు. అలాగే కృష్ణాజిల్లా గన్నవరం నుంచి టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేనివంశీ ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థి వై.వెంకటరావు పిటిషన్ దాఖలు చేశారు. వంశీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలను ఉల్లంఘించారని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి వంశీ అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే వంశీ సూచనమేరకు ఆయన అనుచరులు పాత తహశీల్దార్ సంతకంతో ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారని అయితే అవి నకిలీవని తెలిసి కొందరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వెంకటరావు తన పిటిషన్ లో పొందుపరిచారు. అలాగే పోస్టల్ బ్యాలెట్లను మరోసారి లెక్కించాలని ఆయన పిటిషన్ లో కోరారు. అలాగే నలుగురు పిల్లలున్నా, ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం తనకు ముగ్గురే ఉన్నట్లు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తప్పుడు వివరాలను పొందుపరిచారని వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప 4వేలఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్థి తోట వాణి పై విజయం సాధించారు. చినరాజప్ప దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో ఆదాయ వనరులతో పాటు తనపై ఉన్న క్రిమినల్ కేసులను దాచిపెట్టి తప్పుడు డిక్షరేషన్ ఇచ్చారని పేర్కొంటూ వాణి పిటిషన్ దాఖలు చేశారు. చినరాజప్ప 2007లో ఓబులాపురం మైనింగ్ కార్యాలయంపై దాడి కేసులో 15వ ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. టిడిపి ప్రభుత్వం అధికారం లో ఉన్నపుడు ఆ కేసు క్లోజ్ చేయమని రెండుసార్లు ప్రభుత్వ జీవోలు విడుదల చేయించి కోర్టుకు పంపించారని అయితే కోర్టు వాటిని తిరస్కరించి ఇప్పటికీ వారెంట్‌ను కొనసాగిస్తోందని తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎంగా మరియు మాజీ ఎమ్మెల్సీగా పెన్షన్ అందుకుంటూ వాటిని దాచిపెట్టి కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే తనకు ఆదాయం వస్తున్నట్టు చినరాజప్ప అఫిడవిట్ లో ప్రకటించారని ఆరోపించారు. ఆరునెలల్లో అనర్హతవేటు వేస్తుందన్నారు.