కేరళకు చెందిన జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ శ్రీదేవి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అందరూ అనుకుంటున్నట్లు ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, హత్య చేయబడిందని వ్యాఖ్యానించారు. ఆయన ఇంటర్వ్యూను కేరళకు చెందిన కౌముది పత్రిక ప్రచురించింది. తన ఫ్రెండ్, ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ చెప్పిన విషయాలను ఈ సందర్భంగా డిజిపి రిషిరాజ్ వెల్లడించారు. శ్రీదేవి హత్య చేయబడి ఉంటుందని నా స్నేహితుడు చెప్పడంతో మరిన్ని విషయాలు అడిగాను, కొన్ని కీలక ఆధారాలు ఆమెది యాక్సిడెంటల్ డెత్ కాదు, మర్డర్ అని రుజువు చేస్తున్నాయని చెప్పినట్లు తెలిపారు. ‘‘ఒక వేళ శ్రీదేవి అతిగా మద్యం సేవించినప్పటికీ కేవలం ఒక అడుగు నీళ్లలో పడి ఆమె చనిపోయే అవకాశం లేదు అని నా ఫ్రెండ్ చెప్పారు. డాక్టర్ ఉమాదతన్ ఒక ఫోరెన్సిక్ సర్జన్. చాలా ముఖ్యమైన కేసులు డీల్ చేశాడు. అతడితో కలిసి నేను కూడా చాలా కేసులకు పని చేశాను” అని రిషిరాజ్ సింగ్ వెల్లడించారు. ‘వెనక నుంచి ఎవరో ఒకరు తోయకుండా.. ఒక వ్యక్తి కాలు లేదా తల ఒక అడుగు లోతు ఉన్న బాత్ టబ్ నీటిలో పడటం అసాధ్యం, ఒక వేళ పడినా మరణానికి దారి తీసే స్థాయిలో ఉండదు’ అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పినట్లు డిజిపి స్పష్టం చేశారు. శ్రీదేవి మరణంపై అభిమానుల్లోనూ చాలా సందేహాలు ఉన్నాయి. ఒక చిన్న బాత్ టబ్‌లో పడి ఆమె చనిపోయిందనే వార్తలను ఎవరూ నమ్మలేక పోతున్నారు. మొదట్లో ఆమె మరణానికి హార్ట్ ఎటాక్ కారణమని చెప్పడం, తర్వాత తాగిన మత్తులో బాత్ టబ్‌లో మునిగి చనిపోయిందనే రిపోర్ట్ రావడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. బంధువుల పెళ్లి వేడుక కోసం దుబాయ్ వెళ్లిన ఆమె అక్కడి ఓ స్టార్ హోటల్‌లో శవమై తేలడం అందరినీ షాక్‌కు గురి చేసింది. శ్రీదేవి మరణంపై విచారణ జరిపిన దుబాయ్ పోలీసులు ఎలాంటి కుట్ర కోణం లేదని, ప్రమాద వశాత్తు బాత్ టబ్‌లో పడిపోవడం వల్లనే మరణించిందని తేల్చినప్పటికీ ఇంకా ఈ అనుమానాలు క్లియర్ కాలేదు. శ్రీదేవి పేరు మీద రూ. 240 కోట్ల ఇన్యూసరెన్స్ పాలసీ ఉందని…. ఈ వ్యవహారమే శ్రీదేవి హత్యకు దారి తీసిందని గతంలో కొందరు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. శ్రీదేవి పేరు మీద రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఒమన్ దేశంలో చేయించారని, దుబాయ్‌లో మరణిస్తేనే ఆ ఇన్యూరెన్స్ పాలసీ ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది.