సిఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక పర్యటనకు సర్వం సిద్ధమైనట్లు రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో కలిసి చింతమడక గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. చింతమడక గ్రామ కుటుంబాల వారీగా సమగ్ర సమాచార సేకరణ పూర్తయ్యిందని., గ్రామంలో 596 ఇళ్లు, 874 కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ, ఉద్యానవన, ఆర్అండ్ బీ, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల వారీగా సమగ్ర సర్వే పూర్తయ్యిందని వివరించారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతుల గుర్తింపు, భూమి లేని వారి వివరాలు, ప్లాంటేషను, శానిటేషనులో భాగంగా జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామానికి వచ్చే రహదారిన మొక్కలు నాటడం జరిగిందని, కొత్త రోడ్ల నిర్మాణం పనులకు సంబంధించి అంఛనాలు తయారు చేయడం జరిగిందన్నారు. గ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న మురికి కాల్వల నిర్మాణం పూర్తి కావొచ్చిందని పేర్కొన్నారు. సీఎం గారి సభా సమావేశ వేదిక స్థలం, సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లు పూర్తైనట్లు, హెలిప్యాడ్ తదితర ప్రాంత స్థల గుర్తింపు చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ గారి పర్యటనలో ఏలాంటి లోటుపాట్లు జరగకుండా సర్వం సిద్ధం చేశామని అధికారిక వర్గాలు వివరించారు. గ్రామంలోని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాల్సిన వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి ఆర్డీఓను ఆదేశించారు. గ్రామంలో ఆలయాలకు రంగులు, పలు మిగులు పనులన్నీ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.