ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోగా, పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు కూడా పక్కచూపులు చూడటం ఆపార్టీని, టీడీపీ అధినేత చంద్రబాబును నిత్యం కలవరపెడుతున్నాయి. ఈనేపథ్యంలోనే మళ్లీ టీడీపీ సీనియర్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. తెలుగురాష్ట్రాల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తుండడంతో వంశీ ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో వల్లభనేని వంశీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయవర్గాల్లో వార్తలు వినిపస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మాత్రం ఇటు బీజేపీ, అటు వంశీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. బీజేపీనేత సుజనా చౌదరి ఇటీవల వల్లభనేని వంశీని బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీని వీడబోనని అప్పట్లోనే వల్లభనేని వంశీ ప్రకటించారు. కానీ కిషన్ రెడ్డితో వల్లభనేని వంశీ భేటీ కావడం ఆయన బీజేపీలోకి వెళ్లనున్నారని, మంచి పదవి కూడా రాబోతుందని చెప్తున్నారు. ఈ అంశంపై వంశీ స్పందిస్తూ స్వర్ణభారత్ ట్రస్టులో కిషన్ రెడ్డితో ప్రతీభకు పురస్కారం అనే కార్యక్రమంలో తనను ఆహ్వానించారని, చంద్రబాబు నాయుడు గారికి చెప్పే తాను వెళ్లాననని, బీజేపీలో చేరడం లేదని వివరణ ఇచ్చారు. అయితే పైకి వంశీ ఇలా చెప్తున్నా సుజనా ఆహ్వానం, కిషన్ రెడ్డితో భేటీ, కీలక పదవి ఆఫర్ చేసిన నేపధ్యంలో త్వరలోనే పార్టీ మార్పు ఖాయమనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
