నేడు ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఎదుర్కోనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న జట్టు నాకౌట్ మ్యాచ్‌కు వెళుతుంటే సహజంగానే మార్పులకు ఆస్కారం ఉండదు. భారత జట్టు కూడా దాదాపు అదే తరహాలో ఆలోచిస్తోంది. అనితర సాధ్యమైన రీతిలో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ చెలరేగి ఆడుతుండగా, కోహ్లి ఈసారి సహాయక పాత్రలో సమర్థంగా రాణించాడు. న్యూజిలాండ్‌తో తలపడే సమీఫైనల్స్‌లో ఒత్తిడే కీలకంగా మారుతుందని, దాన్ని జయించిన జట్టే విజయం సాధిస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ పేర్కొన్నాడు. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ పిచ్‌తో సంబంధం లేకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యమని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా ఒత్తిడి ఉంటుందని, ఆ సమయంలో ఏవైనా రెండు తప్పులు చేస్తే మ్యాచ్ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోతుందని అన్నాడు. మళ్లీ దాన్ని మనవైపు తిప్పుకోవాలంటే చాలా కష్టమని..ఎన్నో ఛేదనలు చూసిన తాను ఈ విషయాన్ని గ్రహించినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.