నవ్యాంధ్రను పాలించిన గత తెలుగుదేశం ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారానికి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయలను ప్రకటనలకు వెచ్చిస్తోందని.. అబద్ధాలకు కూడా ఇన్ని డబ్బులు తగలెయ్యాలా అని ప్రతిపక్ష టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్ నాయుడువ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ‘అయ్యా జగన్ గారూ..! ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ ఆరు నెలలపాటు టీడీపీ ప్రభుత్వం పేదలకు నెలకు రూ.2 వేల పింఛను ఇచ్చిన విషయం మరచిపోయారా? అందులో ఐదు నెలలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా’ అని సోమవారం ట్విటర్లో విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులపై జరిగిన కాల్పుల విషయాన్ని ప్రస్తావిస్తూ లోకేశ్ ఓ చిన్న కథను ప్రస్తావించారు. ‘అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం.. తూటాలతో రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చినందువల్ల దేశంలో అందరూ ఆ రాజుగారి గురించి మాట్లాడుకున్నారు.
కాలం గిర్రున తిరిగింది. ఆ రాజుగారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతోంది. కాల మహిమ’ అని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రైతులపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయిన సంఘటన వార్తలను ఆయన దీనికి జతపరచడం విశేషం..