ఆయన గతంలో పోలీసు అధికారి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి చీఫ్ మార్షల్‌గా వ్యవహరించారు. సభలో ఆందోళన చేస్తున్న సభ్యుల్ని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అలాగే దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి సెక్యూరిటీ అధికారిగా కూడా పనిచేసారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి రాజశేఖరరెడ్డి కుమారుడు స్థాపించిన వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టారు. ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఆయనే కర్నూలు జిల్లా నంది కొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్ధర్.. తాను ఏ హోదాలో ఉన్నా ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్తున్నారు. నియోజకవర్గ రైతుల నీటి సమస్యను తీర్చడమే తన కర్తవ్యమని చెప్తున్నారు.
వాస్తవానికి 2014నుంచీ ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 2019లో టికెట్ సాధించి ఘన విజయం సాధించారు. టీడీపీ తరపున హేమాహేమీలంతా ఈ సీటులో వైసీపీని ఓడించాలని చూసినా సాధ్యపడలేదు. అలాగే పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి సిద్దార్ధరెడ్డితో కలిసి పార్టీ విజయానికి ఆర్ధర్ పనిచేసారు. ఏదేమైనా రాజశేఖరరెడ్డి వద్ద సెక్యూరిటీ వింగ్ లో పనిచేసిన వ్యక్తి ఆయన కుమారుడి పార్టీనుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడం విశేషంగా చెప్పుకుంటున్నారు.