తమకోసం త్యాగాలు చేసినవారిని, తమకోసం ఇబ్బందులు పడ్డవారిని, తమకోసం నిరీక్షించినవారికి న్యాయం చేయడంలో వైఎస్ కుటుంబం తర్వాతే ఎవరైనా.. తాజాగా ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కూడా అదే చేసారు. మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఎఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు సుబ్రహ్మణ్యంకు డిప్యూటీ కలెక్టర్ గా గ్రూప్ వన్ సర్వీసు ఉద్యోగం ఇచ్చారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2009 సెప్టెంబరు 2వ తేదీన రాజశేఖర్ రెడ్డితో పాటు వెళ్లిన ఆయన కార్యదర్శి సుబ్రమణ్యం కూడా ఆ ప్రమాదంలో మరణించారు. అయితే ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు.. కానీ కొడుకు జగన్ మాత్రం గుర్తుపెట్టుకున్నారు.
తాను చేయగలిగిన స్థానానికి వచ్చినపుడు తండ్రికోసం అసువులు బాసిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని భావించిన జగన్ ఇప్పుడు న్యాయం చేసారు. సింధు సుబ్రమణ్యంకు కారుణ్య నియామకం కింద గ్రూప్ వన్ ఉద్యోగమిస్తూ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఆదేశాలిచ్చారు. ప్రత్యేక కేసు కింద పరిగణిస్తూ సింధు సుబ్రహ్మణ్యంకు ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జగన్ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.