ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజున పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గంలోనూ పాదయాత్ర సాగింది.. నియోజకవర్గ ఇన్ చార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆక్వారైతుల సమస్యలను జగన్ కు వివరించారు. ఆక్వా రైతులు తాము నష్టపోతున్న వైనాన్ని వివరించారు. అయితే ఆ సమయంలో ఆకివీడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ చేపలు, రొయ్యల చెరువులకు యూనిట్ కరెంట్ రూ.1.50కే ఇస్తామని, అనుబంధ ఉపాధి రంగమైన ఫ్యాక్టరీలకు యూనిట్ కరెంట్ రూ.5 లకు ఇస్తామని హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఈ హామీలన్నీ పూర్తి చేస్తానని ప్రకటించారు. నాలుగో ఏడాదిలో ఆక్వాకు మద్దతు ధర కూడా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
అయితే జగన్ అధికారంలోకి వచ్చి నెల గడిచిందో లేదో పీవీఎల్ కృషితో హామీ అప్పుడే నెరవేరింది. ఇటీవల సీఎం జగన్ ను పీవీఎల్ కలిసి ఆక్వారైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. పీవీఎల్ ను ఎంతో ఆప్యాయంగా పలకరించిన సీఎం ఆయన అడిగిన హామీని నెరవేర్చాలని కోరారు. కారణం ఓడిపోయినా పీవీఎల్ ఏరోజూ ప్రజలకోసం పనిచేయడం మానలేదు.. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. తాను కూడా తనకోసం ఎటువంటి కోరికను సీఎంను కోరలేదు. కేవలం ప్రజలకోసం, ముఖ్యంగా రైతులకోసం మాత్రమే కోరుకున్నారు. ఈ విధానం యువ ముఖ్యమంత్రిని ఎంతో ఆకర్షించిందట.. అందుకే పీవీఎల్ అడిగిన వెంటనే ప్రభుత్వం అక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ హామీ నిజంచేస్తూ జూలై 2వ తేదీన జగన్ నిర్ణయం తీసుకున్నారు. వెనువెంటనే ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ కూడా జీవో జారీ చేశారు. ఆక్వా రైతులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయంపట్ల ఆక్వా రైతులకు రూ.720 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్వా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కల్తీ మందులు, ఎరువుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ రేట్లు ఆక్వా రంగాన్ని మరింత నష్టానికి గురిచేస్తున్న విధానాన్ని పీవీఎల్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా జగన్ స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో జగన్ పాదయాత్రలోనే తాను అధికారంలోకి వస్తే ఆక్వారైతుకు యూనిట్ రూ.1.50 చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. అయినా గత ప్రభుత్వం ఎన్నికలముందు టారిఫ్ కొంత తగ్గించి తద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది. అయినా గోదావరి జిల్లాల వాసులు కూడా వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. దీంతో అధికారం చేపట్టిన కొద్దిరోజులకే జగన్ తానిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇదివరకు యూనిట్ ధర రూ.3.75 పైసలుగా ఉండగా.. ఇప్పుడు రూ.2.25 పైసలకు వచ్చింది. ఈ సబ్సిడీ మొత్తం విద్యుత్ శాఖ ఇస్తుంది.. విద్యుత్ శాఖ డిస్కంలకు సబ్సిడీ మొత్తాన్ని అందిస్తుంది.
ఏపీ ట్రాన్సుకో, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీలు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ కార్యదర్శి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధర ప్రకారం ఇదివరకు మూడు రూపాయలకు పైగా వసూలు చేశారు. ఇప్పుడు దీనిని రూ.1.50 పైసలకు తగ్గించారు. ఇది ఒక సంవత్సరం వరకు అమలులో ఉంటుంది. అయితే పీవీఎల్ కృషితో ఆక్వారైతులకు పెద్దఎత్తున మేలు జరుగుతుండడం పట్ల అందరూ ఆయనపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీవీఎల్ గెలిచిఉంటే నియోజకవర్గ రూపురేఖలు మారిపోయి ఉండేవని చెప్తున్నారు. అయినా తనకు ఓట్లు వేసిన వారికోసం, ముఖ్యంగా ఉండి ప్రజలకోసం ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని, కచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని పీవీఎల్ చెప్తున్నారు.