వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలతో గ్రేట్ అనిపించుకుంటున్నారు . ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తన తండ్రి వైఎస్సార్ మరణించిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐఏఎస్ కుటుంబాన్ని గుర్తు పెట్టుకుని జగన్ ఇప్పుడు వారికి బాసటగా నిలిచారు. తండ్రితో పాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తెకు గ్రూప్ 1 జాబ్ ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి వరుసగా రెండో సారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ కర్నూల్ జిల్లా పావురాల గుట్ట దగ్గర హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ ప్రమాదంలో వైఎస్ తో పాటు అప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక తండ్రి అంత్యక్రియలు ముగిశాక సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు జగన్ . ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఆయన అన్న మాటకు కట్టుబడి నేడు సీఎం అయిన తర్వాత సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోటానికి ఆయన కుమార్తె సింధుకు గ్రూప్ 1 అధికారిణిగా అవకాశం కల్పించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో సింధూను గ్రూప్ 1 అధికారిణిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జగన్ పదేళ్ళ నాటి మాట గుర్తు పెట్టుకుని ఆ ఐఏఎస్ కుటుంబానికి బాసటగా నిలవటంతో దేవుడయ్యాడు అంటున్నారు వైసీపీ అభిమానులు.
