కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నామామాత్రంగానే బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కాగా ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఆశించిన న్యాయం జరగలేదని పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌పై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. ఏ రాష్ట్రానికి, ప్రజలకు నేటి బడ్జెట్ అంత ఉపయోగకరంగా లేదు. ప్రతి ఇంటికి తాగు నీరు బడ్జెట్‌లో పెట్టడం సంతోషకరం. కానీ ఇప్పటికే తెలంగాణలో మిషన్ భగీరథ పేరుతో ఈ పథకం అమలు చేస్తున్నాం. దాన్నే కేంద్రం పేరు మార్చి బడ్జెట్‌లో పెట్టుకున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన వాటికి కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవు. మొత్తంగా బడ్జెట్ తెలంగాణకు మొండి చేయి చూపిందిఅని ఆయన తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని… ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏమీ మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శించారు.