తాజా ఎన్నికల్లో ప్రజాతీర్పు చూస్తే చాలా బాదగా ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం పనిచేశానే తప్ప తప్పు చేయలేదన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఆయన మాట్లాడారు. నేను చేయరాని తప్పు ఏం చేశా..? అంటూ విచారం వ్యక్తంచేశారు. ‘ప్రాంతాల వారీగా, రంగాల వారీగా నేను చేసిన అభివృద్ధి కళ్లకు కనిపిస్తోంది.. కానీ ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. మరీ23 సీట్లకు పరిమితమయ్యేలా నేనేం తప్పు చేశానని అడుగుతున్నా అంటూ ప్రశ్నించారు. ఓటమిని జీర్ణించుకోలేక కన్నీటిపర్యంతమైన కార్యకర్తలను చంద్రబాబు ఓదార్చారు.. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కష్టపడ్డా.. పదిసార్లు ఆయా కంపెనీల చుట్టూ తిరిగాను.. దక్షిణ కొరియా వెళ్లి కియా పరిశ్రమను అనంతపురానికి తెచ్చినా అక్కడ సీటును ఓడిపోయామని వ్యాఖ్యానించారు.
పథకాలు ఇచ్చాం కదా ఓట్లు వేస్తామని కొద్దిమంది నేతలు ఇంట్లో నిద్రపోయారు. నేను జాగ్రత్తపడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. మనపార్టీపై కొందరు కుల పార్టీ ముద్రవేసి అసత్య ప్రచారం చేశారన్నారు. గెలుపోటములు టీడీపీకి కొత్తేమీ కాదని, ప్రతిపక్షంలో ఉండడంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు మరింత సమయం దొరికిందని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చంద్రబాబు అన్నారు. అలాగే చంద్రబాబు మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేసారు. రాష్ట్రంలో వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైయిందన్నారు.. ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాయన్నారు.. సొంత నియోజకవర్గం కుప్పంలో రోడ్‌షో నిర్వహించాక ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే చంద్రబాబు చెప్తున్నట్టుగా వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడా వ్యతిరేకత లేదు.