ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చివరి షాక్ తగిలింది.. ఆపార్టీ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేసారు. ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయగా వారి బాటలోనే రఘువీరా సైతం నడిచారు. అయితే 2014లోనే చాలామంది నేతలు టీడీపీ, వైసీపీలోకి వెళ్లగా 2019లో మిగిలిన చాలామంది నాయకులు ఇతర పార్టీల్లో చేరిపోయారు. అయితే రఘువీరా పార్టీకోసం పనిచేసారు. టీడీపీకి మద్దతిస్తున్నారన్న వాదనతో కాంగ్రెస్ పార్టీపై ఉన్న కాస్త అభిమానం కూడా కార్యకర్తల్లో పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ కు జిల్లాకు పట్టుమని 10మంది నాయకులు, 10మంది కార్యకర్తలు కూడా ఉండరు అంటే ఆశ్చర్యం లేదు. అలాగే టీడీపీ పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారయ్యింది. టీడీపీతో జత కట్టడం వల్లే ఇలా జరుగిందని, లేకుంటే కాస్తయినా కాంగ్రెస్ కోలుకునేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
