మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీ వేదికగా అబద్దాలు చెప్పే అలవాటు ఉందని ఆయనలా అబద్దాలు చెప్పొద్దని నిజాలే మాట్లాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. శాసనసభ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గతంలో నాన్న రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఓ ప్రాజెక్టు గురించి చంద్రబాబునాయుడు తప్పుడు డాక్యుమెంట్‌ను తీసుకొచ్చి అసెంబ్లీలో ఏకంగా చదివేసారని, దానిపై మాట్లాడారని గుర్తుచేశారు. అయితే చంద్రబాబు తీసుకొచ్చిన డాక్యుమెంట్‌పై అప్పటి అధికార పార్టీకి చెందిన నేతలు అయోమయానికి గురైనట్టు తెలిపారు.
అయితే తర్వాతిరోజు ఇదే విషయమై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబునాయుడు ఏం చేశాడో చెప్పారని, అసలు డాక్యుమెంట్ల ఆధారంగా వైఎస్ఆర్ అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు చదివిన తప్పుడు డాక్యుమెంట్లను అసెంబ్లీలో చూపారని జగన్ వివరించారు. చంద్రబాబు తాను నకిలీ డాక్యుమెంట్ ఆధారంగా మాట్లాడినట్టు అసెంబ్లీ వేదికగా ఒప్పుకొన్నారని తెలిపారు. తాను తప్పుడు డాక్యుమెంట్లు చూపితే ప్రభుత్వం సరైన సమాచారాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తోందని అందుకే తాను తప్పుడు సమాచారాన్ని ఇచ్చానని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబులా అబద్దాలు మాట్లాడకూడదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. వాస్తవాలను మాట్లాడాలని కోరారు. ఐదేళ్లలో నడిచినట్టుగా మంచి సాంప్రదాయాలతో సభ నిర్వహిస్తామని జగన్ స్పష్టం చేశారు.