ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై విచారణ నిర్వహించాలని, పాలకవర్గాల గడువు ముగిసిన సొసైటీలకు ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకార శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి ఛాంబర్ లో ముఖ్యమయిన సమావేశం నిర్వహించారు. సొసైటీల ఆడిట్ లు అన్నీ సకాలంలో పూర్తి చేయాలని, నామమాత్రపు ఆడిట్ లను పక్కన పెట్టాలని, సొసైటీలను సక్రమంగా, పకడ్భంధీగా నిర్వహించాలని అన్నారు. ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై పారదర్శకంగా విచారణ నిర్వహించాలని, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ హౌసింగ్ సొసైటీతో పాటు ఎన్నికలు నిర్వహించాల్సిన సొసైటీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఈ నెల 10 తరువాత సహకార శాఖలో డీసీఓ స్థాయి అధికారులు సహా విస్తృతస్థాయి సమావేశానికి ఏర్పాటు చేయాలని నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ వీరభద్రయ్య, అడిషనల్ రిజిస్ట్రార్ సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.