టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి గురించి రాష్ట్ర హోమంత్రి మేకతోటి సుచరిత మొదటిసారి మాట్లాడారు. ఆయనకు భద్రత తగ్గించామంటున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబుకు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే 58 మందికి బదులు 74 మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. అయితే చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులకు తాము ఎటువంటి రక్షణ కల్పించడం కుదరదని స్పష్టంచేశారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే, అది ఆమోదయోగ్యమైతే కల్పిస్తామన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతల అంశాన్ని పక్కదారి పట్టించేలా కావాలని చంద్రబాబు భద్రతపై మాట్లాడుతున్నారని సుచరిత విమర్శించారు. అలాగే ఏ ఎయిర్ పోర్టులో అయినా ప్రతిపక్ష నేతలను తనిఖీ చేస్తారన్నారు. గుంటూరు జిల్లాలో ఆస్తి తగాదాల్లో మరణించిన వారిపట్ల కూడా టీడీపీ రాజకీయాలు చేస్తుందని, గుంటూరు ఆస్తి తగాదాల హత్యను రాజకీయ హత్యగా ప్రచారం చేస్తున్నారన్నారు. అక్రమాలు ఎవ్వరూ చేసినా సహించబోమన్నారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడాల లిస్ట్ లో ఉంది కాబట్టి కచ్చితంగా అన్ని అక్రమ భవనాల మాదిరిగానే దాన్నికూడా కూల్చివేస్తామన్నారు.