తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నెల ఇరవై ఏడో తారీఖున ఆ పార్టీ నేతలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు,మంత్రులతో సమావేశం అయిన సంగతి విదితమే. ఈ సమీక్ష సమావేశంలో ఆ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి దిశ నిర్ధేశం చేసిన సంగతి కూడా తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుండి యాబై వేల మంది వరకు సభ్యత్వ నమోదు చేయించాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆరవై లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు చేయించుకోవాలనే లక్ష్యాన్ని ఆ పార్టీ అధినేత ఈ సమావేశంలో సూచించారు. జూలై ఇరవై వరకు ఈ కార్యక్రమం ముగించాలని కూడా ఆదేశించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గాల వ్యాప్తంగా ఇంచార్జులు,ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎంపీలు,నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోంటున్నారు. దీంతో ఇప్పటికే లక్షల సంఖ్యల్లో ప్రజలు,అభిమానులు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఒక పండుగలా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది.