ఆంధ్రజ్యోతికి నోటీసులు.. ప్రస్తుతం ఈవార్త ఆసక్తిరేపుతోంది. కాకినాడలో నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తుల ప్రింటింగ్ కార్యాలయాన్ని నిర్మించిన ఆంధ్రజ్యోతి అనే పత్రికా సంస్థకు గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీచేశారు. వీరు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల వద్ద అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. అయితే నోటీసు అందిన ఏడురోజుల్లో స్పందించాలని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్ ఆర్డర్ కూడా జారీచేశారు. గత టీడీపీ హయాంలో పాలచర్లలోని సర్వే నంబర్ 208/5ఎలో ప్రింటింగ్ ప్రెస్ భవన నిర్మాణాన్ని ఆంధ్రజ్యోతి గతేడాది నిర్మించింది. ఈఏడాది జనవరిలో కూడా ప్రారంభించింది. ఇక్కడినుంచే మొత్తం పత్రికా వ్యవహారాలు నడుస్తున్నాయి.
దీని నిర్మాణంకోసం డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారుల నుంచి లేదా గుడా నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును కూడా చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. భవన ప్రధాన ముఖ ద్వారం రోడ్డు కాకుండా మరో రోడ్డు నిర్మించాల్సి ఉండగా అక్కడ అలాంటిదేమీ చేపట్టలేదు. అయితే ఈ అక్రమ నిర్మాణాలపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఇప్పుడు తమ భవనానికి అనుమతులు ఇవ్వాలని గుడా అధికారులపై ఒత్తిడితెస్తోంది. భవన క్రమబద్ధీకరణ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని గుడా వర్గాలు చెప్పినా వినడం లేదు. అలాగే బీఆర్‌ఎస్ కింద అయితే 70లక్షలు చెల్లించాల్సి వస్తోందని ససేమిరా అంటోంది. దీంతో రాధాకృష్ణ కుమార్తె అనూషకు గుడా అధికారులు ఈ నెల 25న ప్రొవిజినల్ ఆర్డర్ నోటీసిచ్చారు. ఈ భవనాన్ని తొలగించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులిచ్చారు.