తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు మరో నలుగురిపై లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.పోయిన శనివారం తమశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ కొత్తగూడెం అటవీశాఖ డిప్యూ టీ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణ పిచ్చేశ్వరరావు సోమవారం లక్ష్మీదేవిపల్లి పీఎస్‌లో ఫిర్యాదుచేశారు.
లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లెందు క్రాస్‌రోడ్ సమీపంలోని పాత హెలీప్యాడ్ స్థలంలో శనివారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అటవీభూముల చుట్టూ ప్రహరీ నిర్మాణపనులు ప్రారంభించారు. సిబ్బందితో జేసీబీల ద్వారా ట్రెంచ్ నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో గిరిజనులు ఆ భూమి తమదేనంటూ ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత గిరిజనులతో ఎమ్మెల్యే కలిసి ఫారెస్ట్ అధికారులు చేపట్టిన తవ్వకాలను పూడ్చారని అటవీశాఖాధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవేందర్‌రావు, మాజీ ఎంపీటీసీ పూనెం శ్రీనివాస్, నాయకులు ఎస్కే ఫహీముద్దీన్, భూక్యా లింగయ్య అటవీ అధికారులు ఫిర్యాదు చేశారని ఎస్సై నరేశ్ తెలిపారు.