మరోసారి ఏపి రాజకీయాల్లో పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కాకపోతే అప్పుటి అధికార పక్షం ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అధికార పక్షంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ గెలుపు చంద్రబాబు ఓటమి పట్ల ఆపార్టీ కార్యకర్తలు అక్కసుతో ఉన్నారని, వైసిపికి ఓటేశారని తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆర్కే డిజిపికి వివరించారు. సిఎం జగన్ తో పాటుగా హోం మంత్రి మేకతోట సుచరితపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ఆళ్ల ఫిర్యాదు చేసారు.
కంప్లైంట్ తీసుకున్న డీజీపీ విచారణ చేపడతామన్నారు. వారిని అరెస్ట్ చేస్తామన్నారు. అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడుల పై డిజిపి కి ఫిర్యాదు చేశానని, వైసిపి నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి సుచరిత, జగన్ లపై అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిజిపిని కోరినట్లుగా ఆర్కే వివరించారు. అయితే తాజా ఘటనతో టీడీపీ అధికారంలోకి వస్తుందని, లేదా అధికారంలోకి రాలేదని బాధతో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారికి ఇప్పుడు వణుకు పుడుతోంది. అసభ్యంగా మాట్లాడినవారికి, పిచ్చి పోస్టులు పెట్టినవారిపై చర్యలుంటాయని డీజీపీ ప్రకటించడంతో వారంతా కిమ్మనడంలేదు.