పక్కరాష్ట్రం కర్ణాటకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. తాజాగా బళ్లారి జిల్లాలోని విజయ్‌నగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే ఆనంద్ బి సింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అలాగే బెల్గాం జిల్లా గోకక్ నియోజకవర్గానికి చెందిన మరో శాసన సభ్యుడు రమేశ్ జర్కి హోలి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇద్దరు కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విదేశీ పర్యటనలో ఉండగా ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక పరిణామాలను కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ పరిశీలిస్తూ అంచనాలు వేస్తోంది. మరోవైపు కర్ణాటక రాష్ట్ర సీఎల్పీ లీడర్ సిద్దరామయ్య కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌ను తన నివాసంలో అత్యవసరంగా ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యేల రాజీనామాపై సమావేశంలో చర్చిస్తున్నారు. రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.