కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గానికి చెందిన నారాయణ అనే యువకుడు ప్రపంచస్థాయి ఖ్యాతిని గడించాడు.. పోలండ్ దేశంలో జరిగిన ప్రపంచస్థాయి రోయింగ్ పోటీల్లో భారతదేశం తరపున హర్యానాకు చెందిన కులదీప్ సింగ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నారాయణ ప్రతిభ కనబరిచి మూడవస్థానం సాధించారు. వీరు భారత సైన్యంలో పనిచేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి గ్రామానికి చెందిన కొంగనపల్లి వెంకటస్వామి, సుంకలమ్మల కుమారుడు నారాయణ.. భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. పూణెలో ఆర్మీ హవల్ దార్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈనెల 20నుంచి 23వరకూ జరిగిన ప్రపంచస్థాయి పోటీల్లో మొత్తం ఎనిమిది దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా కులదీప్, నారాయణలు పాల్గొన్నారు. 2వేల మీటర్ల దూరాన్ని కేవలం 7.55 నిమిషాల్లో చేరుకుని శభాష్ అనిపించుకున్నారు. ఈ పోటీల్లో కాంస్య పధకం సాధించారు. ప్రపంచ రోయింగ్ పోటీల్లో భారతదేశం తరపున పాల్గొన్న మొట్టమొదటి జట్టుగా వీరు చరిత్ర సృష్టించారు.
నారాయణకు చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువ.. చిన్నతనంలో కబడ్డీ ఆటలు ఆడుతూ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్యాపిలికి పేరు తెచ్చాడు. అనంతరం 2007లో ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. జమ్మూలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో నారాయణ కాలికి తీవ్ర గాయం జరిగింది. ఆ ప్రమాదంలో నారాయణ కాలి అడుగును తొలగించారు. పూణెలో చికిత్స అనంతరం బెంగుళూరులో తిరిగి 2016లో విధుల్లో చేరాడు. క్రీడలపై ఆసక్తి ఉండడంతో పూణెలో జరిగిన రోయింగ్ పోటీల్లో పాల్గొని దేశానికి పతకాన్ని సాధించాడు. రోయింగ్ లో భారతదేశానికి బంగారు పథకం తీసుకొస్తానని, తనను మరింత ప్రోత్సహించాలని నారాయణ కోరుతున్నాడు. అలాగే ఈ విజయం తనపై మరింత బాధ్యతను పెంచిందని చెప్తున్నాడు. అయితే పేద కుటుంబం అయిన నారాయణను రాష్ట్రప్రభుత్వం కూడా గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచినా అతనిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలదని చెప్తున్నారు. సోషల్ మీడియా ద్వారా యువకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి నారాయణకు మరింత ప్రోత్సాహం అందించి అభినందింపచేయాలని అతని మిత్రులు, ప్యాపిలి ప్రజలు కోరుతున్నారు.
See Also : ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు
See Also : సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్
See Also : పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత