నవ్యాంధ్రలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోక మునుపే జిల్లా టీడీపీకి ఆ పార్టీ ముఖ్య నేత వెన్నుపోటు పొడిచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి
తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అనంతరం భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. సూరి పరిణామం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన బాటలోనే జేసీ బ్రదర్స్, పరిటాల సునీత, కందికుంట ప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారు. జేసీ బ్రదర్స్ జేపీ నడ్డా, రాంమాధవ్‌తో రెండురోజుల కిందట చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీరి చేరికకు కూడా లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
పరిటాల కుటుంబం చూపు కూడా
పరిటాల సునీత కుటుంబం కూడా బీజేపీ వైపు చూస్తోంది. సునీత అల్లుడు బీజేపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి లైన్‌క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి చేరాలని, లేదంటే టీడీపీలో భవిష్యత్ ఉండదని సునీత అల్లుడు చెబుతున్నట్లు సమాచారం. శ్రీరాం కూడా తన బావ ఆలోచనకు అనువుగా కమలం పంచన చేరేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. అయితే సునీతతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న కోటరీలోని కొందరు పరిటాల అంటే టీడీపీ అనే ముద్ర ఉందని, బీజేపీలో చేరితే టీడీపీ శ్రేణులు తమతో వస్తాయా? రావా? అనే ఆలోచన చేస్తున్నారు.
ఇదిలాఉంటే వరదాపురం సూరి బీజేపీలో చేరిన నేపథ్యంలో సునీతను ధర్మవరానికి వెళ్లి సమావేశం నిర్వహించాలని, అలాగే ధర్మవరం ఇన్‌చార్జ్‌గా కొనసాగాలని సునీతకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అధినేత అభిప్రాయాన్ని సునీత సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాప్తాడు ఇన్‌చార్జ్‌గా శ్రీరాం ఉన్నాడని, ధర్మవరం విషయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. అయితే ఇన్‌చార్జ్ బాధ్యతలను తిరస్కరించడం వెనుక త్వరలో వారు కూడా పార్టీ మారాలనే నిర్ణయమే అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జేసీ బ్రదర్స్ చర్చలు కూడా సఫలం
తాడిపత్రిలో 40 ఏళ్లుగా ఏక చత్రాధిపత్యం నడిపిన జేసీ బ్రదర్స్‌కు మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. వారసులిద్దరూ ఓడిపోయారు. జిల్లాలో టీడీపీ ఘోర ఓటమికి జేసీ బ్రదర్స్ కూడా కారణమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దివాకర్‌రెడ్డి కూడా టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, ఆ పార్టీ నైరాశ్యంలో ఉన్న పరిస్థితిని బీజేపీ అవకాశంగా తీసుకుని ఏపీలో బలపడాలనే యోచనలో ఉందని బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు జేసీ పవన్‌రెడ్డి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల కిందటే బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి చేరిక తేదీపై మీరే నిర్ణయం తీసుకోవాలని ‘జూనియర్ బ్రదర్స్’కు చెప్పినట్లు సమాచారం. కాబట్టి సూరి తర్వాత జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబంలో ఎవరు ముందు ఢిల్లీ విమానం ఎక్కుతారా? అనే చర్చ జిల్లాలో సాగుతోంది. ఈ చేరికల వెంటనే కందికుంట ప్రసాద్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది.